Navataram

Real news Real time

ఉపాధ్యాయుడి ‘బాబా’ అవతారం – విద్యార్థుల్లో భయం

తల్లిదండ్రుల్లో ఆందోళన

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోల్ గ్రామ ప్రభుత్వ హైస్కూల్‌లో ఒక ఉపాధ్యాయుడి ‘బాబా’ అవతారం – విద్యార్థుల్లో భయం విధుల్లో ఉండే సమయంలో బాబా వేషధారణలో స్కూల్‌కు హాజరవడం స్థానికుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆయను ప్రతిరోజూ చండి మాలలు, విభూతి, కమండలం, పొడవు గడ్డం, కాషాయపు వస్త్రాలు ధరించి స్కూల్‌కు వస్తుండటం విద్యార్థులు, తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

విద్యార్థుల ప్రకారం, ఆయన తరగతుల సమయంలో కూడా ఆ వేషంలోనే బోధన చేస్తుండటంతో కొందరికి భయం, అయోమయం కలుగుతోందని తెలిపారు. “మా పిల్లలు బాబా వేషంలో ఉన్న సార్‌ను చూసి భయపడుతున్నారు, కొందరు స్కూల్‌కు వెళ్లడానికి కూడా ఇష్టపడటం లేదు,” అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

స్థానికుల సమాచారం

స్థానికుల సమాచారం మేరకు, ఆ ఉపాధ్యాయుడు కురవి మండలం గుండ్రాతిమడుగు స్టేషన్ గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. అక్కడ ఆయన “కామాఖ్య దేవి శక్తి పీఠం” పేరుతో ఒక దేవాలయాన్ని నిర్మించి, దానిని “దేశంలో రెండవ కామాఖ్య శక్తి పీఠం” అంటూ ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది.

తనను “శ్రీ శ్రీ సిద్ధయోగి శివశక్తీ ప్రతాప్‌నాథ్ స్వామీజీ” అని పిలిపించుకుంటూ, మొబైల్ నంబర్‌తో కలిపి వివాహం, సంతానం, ఆరోగ్యం, రాజకీయ విజయం వంటి సమస్యలకు పరిష్కారం అందిస్తానని ప్రకటిస్తూ పత్రికల్లో, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు విద్యాశాఖ అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. “ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఇలాంటి ఆచారాలు, మతప్రచారం చేయడం సమంజసం కాదు. ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది,” అని స్థానికులు అభిప్రాయపడ్డారు.

విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. పిల్లల మనసుల్లో భయం, అపోహలు కలిగించే చర్యలను సహించమని, ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో క్రమశిక్షణ పాటించాలని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *