Navataram

Real news Real time

కాపు, తెలగా, బలిజ, ఒంటరి కులాలపై అన్యాయం? – KRPS డిమాండ్

కాపు,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు, తెలగా, బలిజ, ఒంటరి కులాలకు దశాబ్దాలుగా జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్యాయంపై కూటమి ప్రభుత్వం సత్వరమే సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి (KRPS), కాపు రాజ్యాధికార పోరాట సమితి (KRPS) డిమాండ్ చేసింది.

ఈ మేరకు KRPS నాయకులు విడుదల చేసిన ప్రకటనలో, రాష్ట్రంలో కాపు, తెలగా, బలిజ, ఒంటరి కులాల జనాభా ఎంత? రాష్ట్ర మొత్తం జనాభాలో వారి శాతం ఎంత? ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రయివేటు రంగంలో, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య, శాతం ఎంత అనే వివరాలను ప్రభుత్వం పారదర్శకంగా ప్రకటించాలని కోరారు.

ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు, ఉన్నత హోదాలు, నిర్ణయాధికార స్థానాలలో తమ సామాజిక వర్గానికి చెందిన వారి ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉందని KRPS ఆరోపించింది. ప్రయివేటు రంగంలోనూ అధికంగా అసంఘటిత, తక్కువ వేతనాల పనులకే పరిమితమవుతున్న పరిస్థితి ఉందని తెలిపింది.

వ్యవసాయ కూలీలు, ముఠాకూలీలు, భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలు, హమాలీలు, జట్టు కార్మికులు, వాచ్‌మెన్‌లు, ఆయాలు, పనిమనుషులు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ట్రాక్టర్‌, ట్రక్కు, టాక్సీ డ్రైవర్లు, మోటార్ మెకానిక్స్, తోపుడు బండ్లపై చిరు వ్యాపారాలు చేసేవారు, రోడ్డు పక్కన ఇడ్లీ, బజ్జీ, జిలేబీ, సమోసా బళ్ళు, కూరగాయలు, పండ్లు అమ్మే కార్మికులు అధికంగా ఈ కులాల నుంచే ఉన్నారని పేర్కొన్నారు. ఈ వర్గాల్లో పనిచేస్తున్న వారి సంఖ్య, శాతం ఎంత అనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని KRPS డిమాండ్ చేసింది.

అలాగే సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయాధారిత కుటుంబాలు, నిరుపేదలు, పేదలు, మధ్యతరగతి వర్గాలలో ఈ కులాల ప్రాతినిధ్యం ఎంత? బడా భూస్వాములు, బడా పారిశ్రామికవేత్తలు, ఆర్థికంగా సంపన్న వర్గానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు? వారి శాతం ఎంత? అనే అంశాలపై స్పష్టమైన గణాంకాలు విడుదల చేయాలని కోరారు.

రాజకీయ ప్రాతినిధ్యంపైనా శ్వేతపత్రం విడుదల

రాజకీయ ప్రాతినిధ్యంపైనా శ్వేతపత్రం విడుదల చేయాలని KRPS డిమాండ్ చేసింది. గ్రామ పంచాయితీ వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకు కాపు, తెలగా, బలిజ, ఒంటరి కులాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు? వారి శాతం ఎంత? పంచాయితీ వార్డు సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎం.పి.టి.సి., జెడ్‌.పి.టి.సి. సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అలాగే నామినేటెడ్ పోస్టులలో వారి ప్రాతినిధ్యం ఎంత అనే వివరాలు వెల్లడించాలని కోరారు.

శాసనసభ, శాసనమండలి, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుగా, రాష్ట్ర మరియు కేంద్ర మంత్రులుగా ఈ కులాలకు చెందిన వారి సంఖ్య, శాతం ఎంత అనే అంశాలు ప్రజలకు తెలియజేయాలని KRPS స్పష్టం చేసింది.

విద్య, ఆరోగ్య రంగాల్లోనూ తీవ్ర అసమానతలు ఉన్నాయని KRPS ఆరోపించింది. కాపు, తెలగా, బలిజ, ఒంటరి కులాల్లో అక్షరాస్యత, నిరక్షరాస్యత శాతం ఎంత? పేరెన్నికగల ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల శాతం ఎంత? దీర్ఘకాలిక రోగాలు, అనారోగ్యాలు, పోషకాహార లోపాలతో బాధపడుతున్న వారి శాతం ఎంత అనే అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని కోరింది.

దశాబ్దాలుగా తమ సామాజిక వర్గంపై పాలకపక్షాలు కులవివక్షతో, సవతితల్లి ప్రేమతో వ్యవహరిస్తున్నాయని KRPS తీవ్రంగా ఆరోపించింది. తమ వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా సమస్యలపై సరైన రీతిలో స్పందించలేదని విమర్శించింది. తమ ఆరోపణలు అవాస్తవమని నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని KRPS స్పష్టం చేసింది.

కాపు, తెలగా, బలిజ, ఒంటరి కులాలకు ఆంధ్రప్రదేశ్‌లో నిజంగా న్యాయం జరుగుతోందా? లేక అన్యాయం జరుగుతోందా? అనే అంశాన్ని శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందుకు తీసుకురావాలని KRPS కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ డిమాండ్ చేసింది.

సామాజిక ఉద్యమాభివందనములతో…
– కాపు రిజర్వేషన్ పోరాట సమితి (KRPS)
– కాపు రాజ్యాధికార పోరాట సమితి (KRPS)
సంప్రదించండి: 9866645313, 9963561116, 9949249170

Recent Post:-

13వ రోజుకు రైతుబజారు–కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని డిమాండు

How to Lose Lower Belly Fat for Women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *