దేశంలో 140 కోట్ల జనాభాలో 100 కోట్లు గ్రామాల్లోనే నివసిస్తున్నారు
ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి చేపట్టిన ఉత్తరాంధ్ర జల వనరుల ప్రాజక్తులు మరియు పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రలోని అనేక గ్రామాలలో పర్యటించడం జరిగింది.గ్రామ స్వరూపం మారితేనే దేశ స్వరూపం మారుతుంది.
ప్రతి గ్రామం లో ఊరు బయట బహిరంగ మల విసర్జన:-
మా పరిశీలనలో కొన్ని విషయాలను గమనించడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రతి గ్రామం లో ఊరు బయట బహిరంగ మల విసర్జన చేస్తున్నారు , గ్రామాల్లోని కాలువలు నిర్వహణ పూర్తిగా కుంటు పడింది. అదేవిధంగా ఎక్కడపడితే అక్కడ చెత్త , పాలిథిన్ కవర్లు కనిపిస్తున్నాయి, గ్రామాల్లోని వీధులు కూడా ప్రతి ఒక్కరూ తమ గృహాలను ముందుకు నడిపి నిర్మించటం వలన చిన్నవిగా మారిపోయాయి. దాని వలన కూడా గ్రామాలు తమ స్వరూపాలు కోల్పోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా గ్రామాలు మద్యానికి బానిసగా మారిపోయాయి. అన్నీ కలిసి గ్రామాలు నిర్జీవంగా కనిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చుక్కపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ వాళ్లు ఏర్పాటు చేసిన ఒక హెచ్చరిక బోర్డు గ్రామాలకు వెలుగు నింపేదిగా కనిపించింది.

గ్రామస్తులు ఎవరైనా బహిరంగ మలవిసర్జన చేయటం కానీ, చెత్త బయట వేయడం కానీ చేస్తే 500/- జరిమానా విధిస్తామని పంచాయతీ వారు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం, బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ ప్రజలు ఎవరూ కూడా పంచాయతీ నిబంధనలను అతిక్రమించకుండా చూడటం కూడా జరుగుతుందని తెలియజేశారు.
ఇలాంటి పరిణామాలు ప్రతి గ్రామంలోనూ ఎంత త్వరగా వస్తే దేశం అంత త్వరగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
140 కోట్ల పైబడిన జనాభా కలిగిన మన దేశంలో సుమారు 100 కోట్ల ప్రజలు గ్రామాల్లో మాత్రమే నివసిస్తుండగా గ్రామాలకు వెలుగును తీసుకురాకుండా దేశం అభివృద్ధి చెందుతుందని ఆశించడం అత్యాశ అవుతుంది.
ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షులు శ్రీశ్రీశ్రీ భారతనంద స్వామీజీ గ్రామాభివృద్ధి ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. ప్రతి గ్రామంలో 100% మరుగుదొడ్లు వినియోగం, చెత్త చెదారం బయట వేయకుండా శుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపు అవసరమని ఆయన సూచించారు. శుద్ధమైన త్రాగునీరు, నాణ్యమైన విద్య, సమగ్ర వైద్యసేవలు ప్రతి పౌరునికి అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా గ్రామాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడం ద్వారా ప్రజలు నగరాల వైపు వలసలు తగ్గించవచ్చని తెలిపారు. ఈ చర్యలతో మధ్యవర్తిత్వం లేని, స్వావలంబన గ్రామాలుగా మారితే భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవడం అసాధ్యమేమీ కాదని స్వామీజీ అభిప్రాయపడ్డారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి వ్యక్తి తమ బాధ్యతగా స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు..











Leave a Reply