— ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఫిల్మ్‌నగర్ అపోలో హాస్పిటల్ సమీపంలో ఉన్న ఆటో యూనియన్ స్టాండ్ వద్ద జూబ్లీహిల్స్‌లో ఆటో డ్రైవర్ల జేఏసీ సమావేశం ఆదివారం ఆటో డ్రైవర్ల జేఏసీ (Joint Action Committee) ఆధ్వర్యంలో ఘనంగా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆటో JAC రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ హాజరై ఆటో డ్రైవర్ల సమస్యలపై తీవ్రంగా స్పందించారు.

ఆయన మాట్లాడుతూ, “ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో డ్రైవర్ కడుపులో ఆకలి, కళ్లలో కన్నీళ్లతో బతుకుతున్నారు. ఈ దుస్థితికి కారణం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తప్ప మరెవ్వరూ కాదని” విమర్శించారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల జాబితా
మంద రవికుమార్ వివరించిన ప్రకారం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కొన్ని ముఖ్యమైన హామీలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. వాటిలో:
- ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు,
- ప్రతి నెలా ₹12,000 ఆర్థిక సహాయం,
- ఉచిత ఆటో బీమా సదుపాయం,
- ఆటోలకు సంబంధించిన లోన్ మాఫీ మరియు కొత్త అనుమతులపై సడలింపులు
వంటివి ముఖ్యమని తెలిపారు. “ఇప్పటికీ ప్రభుత్వం ఈ హామీలను అమలు చేయకపోవడం ఆటో డ్రైవర్లను నిరాశకు గురి చేస్తోంది. ఇక సహించలేము, హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం” అని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్‌లో 30 వేల ఆటో కుటుంబాలు
ఈ సందర్భంగా ఆటో జేఏసీ నాయకులు మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 30 వేల ఆటో డ్రైవర్ కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. “ఈ ఉప ఎన్నికల్లో ఆటో డ్రైవర్లు తమ ఓట్ల శక్తిని చూపించాలి. ఎవరు మన సమస్యలను పట్టించుకుంటారో, ఆటో కార్మికుల కోసం నిజంగా పని చేస్తారో వారినే గెలిపించాలి. మన ఓటు మన బలం. రాజకీయ పార్టీలకు ఆటో డ్రైవర్ల శక్తి ఏంటో తెలియజేయాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు.
ఆటో డ్రైవర్ల జీవన పరిస్థితులు దయనీయమైపోయాయి:-
రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే దస్తగిరి (చోటు) మాట్లాడుతూ, ఇంధన ధరలు పెరుగుతున్నా, ఆటో మీటర్ల రేట్లు మారకపోవడం వల్ల డ్రైవర్లు నష్టాల్లో ఉన్నారని చెప్పారు. “రోజువారీ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. లీజు వాహనాలు నడిపేవారికి డిపాజిట్లు, రిపేర్ ఖర్చులు, ఫైనాన్స్ వడ్డీలు అన్నీ కలిపి జీవనమే భారమైంది” అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుగుడాల సాయిలు, బుదురు మల్లేష్, అంజి, ఉప్పరపల్లి చెన్నయ్య, అంజి ముదిరాజ్ తదితరులు మాట్లాడుతూ, ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మహా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు — సమయావధి ప్రకటించాలి
నాయకులు ప్రభుత్వాన్ని ఉద్దేశించి, “ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, దానికి సంబంధించిన నియమావళి ఏమిటి అనే వివరాలను తక్షణం ప్రకటించాలి. ఆటో డ్రైవర్లకు ఆరోగ్య భద్రత, బీమా, పెన్షన్ వంటి హక్కులను ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు.
సమావేశానికి ప్రాంతీయ ఆటో యూనియన్ల ప్రతినిధులు, వందలాది ఆటో డ్రైవర్లు హాజరై తమ సమస్యలను వెల్లడించారు. ఆటో డ్రైవర్ల నినాదాలతో ఫిల్మ్‌నగర్ పరిసరాలు మార్మోగాయి. కార్యక్రమం చివర్లో జేఏసీ నాయకులు ఆటో డ్రైవర్ల ఐక్యతతోనే మార్పు సాధ్యమని పిలుపునిచ్చారు.
“ప్రతీ ఆటో డ్రైవర్ కంట తడి తుడవడం ప్రభుత్వ బాధ్యత” — మంద రవికుమార్
ఆయన చివరిగా మాట్లాడుతూ, “మనమందరం ఒకటిగా ఉంటే ఎవ్వరూ మన హక్కులను తాకలేరు. ఆటో డ్రైవర్ కంట తడి తుడవడం ప్రభుత్వ బాధ్యత. మన ఓటు మన గళం. మన హక్కుల కోసం మనమే పోరాడుదాం” అని పిలుపునిచ్చారు.











Leave a Reply