పెద్దంపేట గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మండల పశు వైద్య అధికారి డాక్టర్ హారికతో కలిసి స్థానిక సర్పంచ్ జాడి వెంకటేష్ ప్రారంభించారు. గ్రామ పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఈ శిబిరం నిర్వహించడం ఆనందకరమని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన మండల పశు వైద్య అధికారి డాక్టర్ హారిక పాడి రైతులు పశుగ్రాసాల పెంపకం, దూడల పెంపకం, లింగ నిర్దారణ వీర్యం వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు సీజనల్‌గా వచ్చే వ్యాధులను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.

కొన్ని పశువుల్లో గర్భకోశం సరిగా ఎదగకపోవడం వల్ల మొదటి ఎద వయస్సు వచ్చినా ఎదకు రాకపోవడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పశు వైద్యులను సంప్రదించి గర్భకోశం ఎదుగుదల పరీక్షలు చేయించి తగిన చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. అలాగే కొన్ని పశువులకు నెల, రెండు నెలలు, మూడు నెలలు లేదా ఆరు నెలలలో గర్భస్రావాలు జరగడం గమనించవచ్చని, దీనికి గర్భకోశ వ్యాధులే ప్రధాన కారణమై ఉండవచ్చని వివరించారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 50 పాడి పశువులకు గర్భకోశ వ్యాధులపై పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాడిపెల్లి కవిత రవీందర్, పశువైద్య అధికారి డాక్టర్ భూమన్న, గోపాలమిత్ర సూపర్వైజర్ ఏ. రవి, గోపాలమిత్రలు కృష్ణమూర్తి, అభిలాష్, వార్డు సభ్యులు పొట్టాల లక్ష్మి–శ్రీనివాస్, పశువైద్య సిబ్బంది, గ్రామస్తులు, పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











Leave a Reply