Navataram

Real news Real time

బాధితులకు భరోసా కల్పించాలి:సిపి అంబర్ కిషోర్ ఝా


పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పిస్తూ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వర్తించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా సూచించారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం మంచిర్యాల జోన్‌ పరిధిలోని హాజీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు పోలీస్‌ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సిపి పోలీస్‌ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా స్టేషన్‌ రిసెప్షన్‌, సిసిటిఎన్‌ఎస్‌ విభాగాల పనితీరును పరిశీలించారు. రిసెప్షన్‌ సిబ్బందితో కమ్యూనికేషన్‌ సెట్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్‌తో సమన్వయాన్ని తనిఖీ చేశారు. స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, పెండింగ్‌ కేసులు, కోర్టు కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులను సిపి క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


స్టేషన్‌ పరిధిలో నేరాల పరిస్థితులు, ప్రజల జీవన విధానం, గ్రామాల్లోని సమస్యలు, ముఖ్యమైన ప్రాజెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ, డిసిలు, మిస్సింగ్‌, ప్రాపర్టీ నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
సీపీ మాట్లాడుతూ…విజిబుల్‌ పోలీసింగ్‌, పెట్రోలింగ్‌ నిర్వహించి ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని, ప్రతి పోలీస్‌ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని అన్నారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.
తనిఖీల అనంతరం పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్‌, ఎసిపి ప్రకాష్‌, మంచిర్యాల రూరల్‌ సిఐ అశోక్‌ కుమార్‌, ఎస్‌ఐ స్వరూప్‌ రాజ్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *