ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులకు సూచించారు. మంగళవారం కౌటాల మండల కేంద్రంలో ఆమె పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ వైద్యుడు లేకపోవడంతో కేవలం సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు గమనించారు. డాక్టర్ పవన్ కళ్యాణ్ రాజీనామా చేయడంతో ప్రస్తుతం వైద్యుడు అందుబాటులో లేడని సిబ్బంది తెలిపారు. హాస్పిటల్‌లోని రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్ పలువురు సిబ్బంది విధులకు హాజరు కాకపోవడం, హాజరు పట్టికలో ఖాళీలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్ లేకపోవడంతో ఆయుష్ డాక్టర్ వారంలో మూడు రోజులు వస్తున్నారని సిబ్బంది తెలిపారు. అయితే ఆయుష్ అటెండర్ విధులకు హాజరు కాకపోవడంతో అతడిని గైర్హాజరుగా నమోదు చేశారు. డేటా ఎంట్రీ గది మూసి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ గది తెరిపించి పరిశీలించగా కంప్యూటర్, ప్రింటర్లపై దుమ్ము పేరుకుపోయి ఉండటం గమనించారు. దీనిని చూసి సిబ్బంది పని తీరు అర్థమవుతోందని, విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.
అనంతరం జిల్లా పరిషత్ సెకండరీ హాస్టల్‌ను తనిఖీ చేసి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. గైర్హాజరైన విద్యార్థుల వివరాలు తెలుసుకున్నారు. నాలుగు రోజుల్లో పరీక్షలు ఉన్నందున భయపడకుండా ప్రశాంతంగా చదువులపై దృష్టి పెట్టాలని సూచించారు. వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ముందుకు సాగాలని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనం, ప్రహరీ గోడ నిర్మాణంపై కూడా ఆరా తీశారు.

అలాగే పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని పరిశీలించారు. అనంతరం బీసీ బాలుర హాస్టల్‌ను తనిఖీ చేసి స్టోర్ రూమ్, వంటగది, విద్యార్థుల గదులను పరిశీలించారు. విద్యార్థులకు శుభ్రతతో కూడిన ఆహారం అందించాలని వార్డెన్‌కు ఆదేశించారు.
ప్రాణహిత నది పరిశీలన
కౌటాల మండల పర్యటనలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిని కలెక్టర్ పరిశీలించారు.ప్రాణహిత నది వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నదుల కలయికతో ప్రాణహిత నది ఏర్పడుతుందని ఎంపీడీవో ప్రసాద్ వివరించారు.
నీటి లభ్యత, వర్షాకాలంలో వచ్చే వరద పరిస్థితులపై కలెక్టర్ ఆరా తీశారు. ఎండాకాలంలో కూడా నదిలో నీరు ఉంటుందా అనే విషయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ప్రసాద్, తహసీల్దార్ ప్రమోద్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Recent Post:-
రెడ్ క్రాస్ సొసైటీ కి ఎంపీ 2 లక్షల విరాళం
The Complete Guide to Fiber Enriched Food for a Healthier Life











Leave a Reply