ఆంధ్రప్రదేశ్లో త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటర్ల జాబితాల తయారీకి ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం, 01.01.2026ను అర్హత తేదీగా తీసుకొని, ప్రస్తుత అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను ఆధారంగా చేసుకొని గ్రామ పంచాయతీలకు వార్డు విభజనతో కూడిన ఫోటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని పేర్కొంది. నిబంధనల ప్రకారం ఫారం–Iలో ఈ జాబితాలను రూపొందించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.తయారు చేసిన ఓటర్ల జాబితాలను 2026 మార్చి 9వ తేదీన అధికారికంగా ప్రచురించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ జాబితాలే గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు ప్రాతిపదికగా ఉపయోగించనున్నట్లు తెలిపింది.
గ్రామ పంచాయతీ ఫోటో ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు సంబంధించిన విధివిధానాలపై ప్రత్యేక మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఈ నిర్ణయంతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లయింది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం కోసం ఈ చర్య కీలకంగా మారనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.












Leave a Reply