ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్నరెబ్బెన మండలంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన రుచికరమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు.

శనివారం జిల్లాలోని రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వంటశాల, తరగతి గదులు, హాజరు పట్టికలు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని, భోజనశాల, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేసి ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఉపాధి హామీ కార్యాలయాన్ని సందర్శించి కూలీలకు కల్పిస్తున్న పని దినాల రిజిస్టర్లను పరిశీలించి, అర్హులైన కూలీలకు నిబంధనల ప్రకారం పని దినాలు కల్పించాలని సూచించారు.
మండలంలోని లక్ష్మీపూర్ గ్రామపంచాయతీ నర్సరీని పరిశీలించిన కలెక్టర్, మొక్కల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, సకాలంలో నీటిని అందించాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే పులికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, గర్భిణులు, బాలింతలకు సమయానుసారంగా పరీక్షలు నిర్వహించి పోషక ఆహారం, అవసరమైన మందులు అందించాలని ఆదేశించారు.
తదుపరి తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి రికార్డులు, వివిధ ధ్రువపత్రాలు, కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కొండపల్లి గ్రామపంచాయతీ నర్సరీ నిర్వహణను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమాల్లో తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, వైద్యులు, ఆయా గ్రామాల సర్పంచులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.











Leave a Reply