Navataram

Real news Real time

నల్లమలలో బంజారా సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రంనిర్మాణం– సీఎం ప్రకటన

హైదరాబాద్: బంజారా సమాజ ఆరాధ్యదైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నల్లమల అటవీ ప్రాంతంలో అత్యద్భుతంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో జరిగిన సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ పొరిక బలరాం నాయక్ తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

ఆదివాసీలకు ఆదిలాబాద్‌లో నాగోబా దేవాలయం, మేడారంలో సమ్మక్క-సారలమ్మ పుణ్యక్షేత్రం ఉన్నట్టే బంజారాలకు ప్రత్యేక క్షేత్రం లేదని సీఎం పేర్కొన్నారు. అందుకే నల్లమల అటవీ ప్రాంతంలో ఇప్పటికే 20 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రపంచంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలోని అన్ని తండాలు, గూడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాల, పంచాయతీ భవనం నిర్మాణానికి స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లేని చోట సోలార్ పంపుసెట్ల ఏర్పాటు ద్వారా గిరిజనులకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు.

“మానవజాతి శాంతి మార్గంలో నడవాలని బోధించిన సంత్ సేవాలాల్ దేశవ్యాప్తంగా కోట్లాది గిరిజనులకు ఆదర్శప్రాయుడు. అలాంటి మహనీయుడి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత” అని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో లంబాడా సోదరుల పాత్రను ఎవరూ మరువలేరని, వారికి సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించడం తమ బాధ్యత అని చెప్పారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, విద్య ద్వారానే పేదరికాన్ని అధిగమించగలమని ఉద్బోధించారు.

విగ్రహానికి పుష్పాంజలి

కార్యక్రమంలో సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి సీఎం పుష్పాంజలి ఘటించారు. బంజారాలు ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించి అభినందించారు.

Recent Post:-

సేదతీర్చే లక్ష్యంతో పెరిక సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

The Complete Guide to Fiber Enriched Food for a Healthier Life

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *