జూరాల నుంచి సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలి: సీపీఐ నేత రమేష్
వనపర్తి, :- జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని గత నెలలో ఆందోళన చేపట్టిన రైతులపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. గురువారం వనపర్తిలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జూరాల ప్రాజెక్టుకు నీరు చేరిందని, మంత్రులు కాలువల్లోకి సాగునీరు విడుదల చేయడంతో రైతులు పెద్ద ఎత్తున అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వరి పంటలు సాగు చేశారని తెలిపారు. అయితే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుతుందనే కారణంతో అర్ధాంతరంగా సాగునీటి సరఫరా నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు.
రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి: సీపీఐ
రైతులు సంఘద్రోహులు కాదు.. అన్నదాతలు
సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో ఆవేదనకు గురైన కొందరు రైతులు కాలువల గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించారని రమేష్ తెలిపారు. వారు సంఘద్రోహులు, దేశద్రోహులు కాదని, సమాజానికి అన్నం పెట్టే అన్నదాతలని అన్నారు. అలాంటి రైతులపై కేసులు నమోదు చేయడం దారుణమని విమర్శించారు.
రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపైనే కేసులు పెట్టడం సరికాదన్నారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వానికీ ప్రజల మద్దతు నిలవలేదని హెచ్చరించారు. వెంటనే రైతులపై నమోదైన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి: సీపీఐ
నెల రోజుల పాటు సాగునీరు అందిస్తే పంటలు చేతికి వస్తాయి
ప్రస్తుతం వరి పంటలు కరుకు, పొట్ట, ఈనె దశల్లో ఉన్నాయని, ఈ కీలక సమయంలో సాగునీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. మరో నెల రోజుల పాటు సాగునీరు అందిస్తే పంటలు చేతికి వస్తాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.
కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదించి మూడు టీఎంసీల నీటిని సాధించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆ నీరు అందలేదని విమర్శించారు. వెంటనే కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించి జూరాల ఆయకట్టు రైతులకు అందించాలని డిమాండ్ చేశారు.
కొత్తకోట, వనపర్తి, శ్రీరంగాపూర్ మండలాల్లో ఎండిపోతున్న పంటలు
జూరాల కాలువ ద్వారా వనపర్తి జిల్లా రామన్పాడు వరకు నీరు చేరాల్సి ఉందని, అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా కొత్తకోట, వనపర్తి, శ్రీరంగాపూర్ మండలాలకు సాగునీరు సరఫరా కావాల్సి ఉందని వివరించారు. అయితే నీరు అందక ఆయా మండలాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని, రైతుల పంటలను కాపాడేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని రమేష్ కోరారు.
ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, పట్టణ సహాయ కార్యదర్శులు గోపాలకృష్ణ, శివకుమార్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వినాదం తదితరులు పాల్గొన్నారు.
Recent Post:-
తల్లి జ్ఞాపకార్థం ఉచిత వైకుంఠ రథం..
Homemade Remedy for Cold: Simple and Effective Natural Relief at Home











Leave a Reply