Navataram

Real news Real time

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. సోమవారం జిల్లాలోని కోటపల్లి మండలంలోని కోటపల్లి, మల్లంపేట, నీల్వాయి గ్రామపంచాయతీలలో కొనసాగుతున్న పారిశుధ్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, త్రాగునీటి సరఫరా, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అంశాలను పరిశీలించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా అధికారులు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించాలని, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించి నివాస ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకునేలా వివరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా  ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్ణీత విస్తీర్ణంలో నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకునేలా అధికారులు పర్యవేక్షించాలని, నిర్మాణ దశకు అనుగుణంగా బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా అందిస్తున్న ఇసుకను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాలలో వరి వంగడాలను తయారు చేయడానికి పాటించే పద్ధతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.  నీల్వాయి గ్రామపంచాయతీ కార్యాలయం నూతన  భవనం, గ్రామంలో కంపోస్ట్ షెడ్ లో తయారు అవుతున్న ఎరువును పరిశీలించారు.

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, ఆహారం తయారీలో శుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుమారస్వామి, మండల పంచాయతీ అధికారి వెంకటేష్, పంచాయతీరాజ్ ఎ.ఈ. ప్రదీప్, గృహ నిర్మాణ శాఖ ఎ.ఈ. కార్తీక్, పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Recent Post:-

కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలు 2026–27

Best Foods for Hair Growth: A Complete Diet Guide for Strong and Healthy Hair

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *