Navataram

Real news Real time

రైతు వేదికలో HT పత్తి సాగుపై అవగాహన శిక్షణ

గుడిపేట రైతు వేదికలో ఆత్మ (ATMA – Agriculture Technology Management Agency) ఆధ్వర్యంలో “HT పత్తి సాగు – ప్రతికూల ప్రభావాలు మరియు సవాళ్లు” అనే అంశంపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు HT పత్తి వల్ల పర్యావరణం, ఆరోగ్యం మరియు ఆర్థిక వ్యవస్థపై కలిగే ప్రభావాల గురించి అధికారులు వివరించారు.

అధికారులు మాట్లాడుతూ HT పత్తి అనేది జన్యుపరంగా మార్పులు చేసిన పత్తి రకం (HtBt) అని తెలిపారు. ఇది గ్లైఫోసేట్ (Glyphosate) అనే కలుపు సంహారిణిని తట్టుకోగలదని, అయితే భారతదేశంలో దీనికి ఇంకా అధికారిక అనుమతి లభించలేదని చెప్పారు.
గ్లైఫోసేట్ మందును అధికంగా వాడటం వల్ల కలుపు మొక్కలు ఆ మందును తట్టుకునే శక్తిని పొందుతూ భవిష్యత్తులో ఏ మందుకూ లొంగని ‘సూపర్ వీడ్స్’ గా మారే ప్రమాదం ఉందని వివరించారు. దీని వల్ల పొలాల్లోని సహజ జీవవైవిధ్యం నశించే ప్రమాదం ఉందని తెలిపారు.
అలాగే గ్లైఫోసేట్ వాడకం వల్ల మట్టిలోని మేలు చేసే బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులు నశించి నేల సారహీనంగా మారుతుందని చెప్పారు. పొలాల గట్లపై పెరిగే ఔషధ మొక్కలు మరియు దేశీయ రకాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఆరోగ్య పరంగా కూడా గ్లైఫోసేట్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. రక్షణ లేకుండా పిచికారీ చేయడం వల్ల రైతులకు శ్వాసకోశ మరియు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఆర్థిక మరియు చట్టపరమైన సమస్యల గురించి మాట్లాడుతూ, HT పత్తి విత్తనాలకు భారతదేశంలో చట్టబద్ధ అనుమతి లేకపోవడం వల్ల పంట నష్టపోతే బీమా లేదా పరిహారం లభించదని తెలిపారు. నల్లబజారులో నాణ్యతలేని విత్తనాల వల్ల రైతులు మోసపోయే ప్రమాదం ఉందని, అనుమతి లేని విత్తనాల విక్రయం లేదా సాగు చేస్తే జరిమానాలు మరియు జైలు శిక్షలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డివిజన్ ఏడీఏ కృష్ణ, స్థానిక కార్పొరేటర్ రాజన్న, రైతు ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్లు, జిల్లా టెక్నికల్ ఏడీఏ గోపి, మంచిర్యాల ఎంఏఓ మహేందర్, దండేపల్లి ఎంఏఓ అంజిత్ కుమార్, ఏఈఓలు మరియు రైతులు పాల్గొన్నారు.

Recent Post:-

ముల్కల్లలో ఘోర రోడ్డు ప్రమాదం – ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

Homemade Remedy for Cold: Simple and Effective Natural Relief at Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *