రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు అరైవ్- అలైవ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్, రవాణా, విద్య వైద్య, రహదారులు భవనాల శాఖల అధికారులతో అరైవ్ – అలైవ్ కార్యక్రమం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందని, ఆయా జిల్లా అధికారుల అధ్యక్షతన కార్యచరణను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఈ నెల 13వ తేదీన గ్రామ స్థాయిలో రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు గ్రామ రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలని, ఈ కమిటీలకు సర్పంచ్ చైర్మన్గా, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, యువత సభ్యులుగా వ్యవహరిస్తారని, గ్రామాల్లో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. బోర్వెల్స్ మూసివేత, రహదారుల పక్కన పొదల తొలగింపు, బ్లైండ్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, గ్రామస్థాయిలో రహదారి భద్రత ప్రచారం కోసం వాట్సాప్ గ్రూపుల ఏర్పాటు చర్యలు చేపట్టాలని తెలిపారు. 14వ తేదీన డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా రహదారి భద్రతపై ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించాలని, మండల స్థాయిలో ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, జీబ్రా క్రాసింగ్స్ పునరుద్ధరణ చేపట్టాలని తెలిపారు. 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా పిల్లలకు మైనర్ డ్రైవింగ్, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పాఠశాలల వద్ద రహదారి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ బస్సులు, ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతపై సూచనలు చేయాలని తెలిపారు.

16వ తేదీన సోషల్ మీడియా ద్వారా రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, డ్రైవర్లలో చూపు సమస్యలు ఉన్న వారిని గుర్తించడం, వాహన భీమా, రిజిస్ట్రేషన్ పత్రాల తనిఖీ, భారీ లోడ్ వాహనాల పర్యవేక్షణ, వాహనాలకు రియర్ వ్యూ మిర్రర్లు తప్పనిసరి చేయడం, డ్రైవర్లకు యూనిఫారం పాటించడంపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు. 17వ తేదీన “గోల్డెన్ అవర్ రెస్పాన్స్ ట్రైనింగ్” కార్యక్రమం నిర్వహించాలని, వాలంటీర్లు, ప్రజలకు రహదారి ప్రమాదాల సమయంలో తక్షణ స్పందన, ప్రమాదంలో గాయపడిన వారిని సమయానికి రక్షించే అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 18న “జీరో ఎన్ఫోర్స్మెంట్ డే”గా పాటించాలని, రహదారి భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని, పాఠశాల బస్సుల తనిఖీలు నిర్వహించాలని, పాఠశాల పరిసరాల్లో భద్రతా చర్యలు మెరుగుపరచడం, జిల్లా వ్యాప్తంగా స్పీడ్ లిమిట్స్ అమలు చేయడం, అవసరమైన చోట్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా అధికారులు ఈ కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి, ప్రజల ప్రాణ రక్షణకు కట్టుబడి పని చేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేపట్టిన అరైవ్- అలైవ్ కార్యక్రమాన్ని కార్యచరణ ప్రకారం అధికారుల సమన్వయంతో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి సి పి ఎ.భాస్కర్, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Recent Post:-
చిత్తడి నేలగా గుర్తించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
Workout Routine for Men: Complete Weekly Gym Plan for Strength and Fitness











Leave a Reply