ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారుల ద్వారా ప్రజలకు ఎన్యుమరేషన్ ఫారాలు అందించడం జరిగిందని, ఫారాలు పూరించిన తర్వాత బూత్ స్థాయి అధికారులు సేకరించి వాటిలోని సమాచారాన్ని బిఎల్ఓ యాప్ లో డిజిటలైజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాలను సరైన సమాచారంతో నింపడంలో రాజకీయ పార్టీలచే నియమించబడిన బూత్ స్థాయి ఏజెంట్లు ప్రజలకు సహకరించి, స్పష్టమైన సమాచారాన్ని పొందుపరిచేలా కృషి చేయాలని తెలిపారు. ఏజెంట్లు క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫారం నింపేందుకు ప్రజలకు అందుబాటులో ఉండేలా రాజకీయ పార్టీలు చొరవ తీసుకోవాలని తెలిపారు.
ఓటరు వివరాలను నింపిన ఎన్యుమరేషన్
జూలై 24 వ తేదీ వరకు గడువు ఉన్నందున ఓటరు వివరాలను నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను అందించని పక్షంలో ఓటు కోల్పోయే అవకాశం ఉందని, బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువత ఫారం పూరింపులో ప్రజలకు సహకరించాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించే విధంగా ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా 2002 సంవత్సరంలో ఓటు హక్కు కలిగిన వారి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తూ ప్రస్తుత సవరణ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 72 శాతం అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, డబుల్, షిఫ్టెడ్, డెత్ ఓటర్ల తొలగింపు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొరకు వాలంటీర్లకు, పంచాయతీ కార్యదర్శులకు, ఎన్ సి సి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వారితో కలిసి ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేలా రాజకీయ పార్టీలు సహకరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Recent Post:-
జలధారపై రోజువారీ టెలి కాన్ఫరెన్స్‌లు: అధికారులకు కలెక్టర్ సూచనలు











Leave a Reply