Navataram

Real news Real time

ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి సవిత

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం: రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్‌. సవిత మంగళవారం మాదల ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఆమెతో పాటు స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు.

ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి సవిత ఈ సందర్భంగా మంత్రి సవిత పాఠశాలలోని తరగతి గదులు, విశ్రాంతి గదులు, స్టాక్ రూమ్, మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లను స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారికి అందుతున్న విద్యా ప్రమాణాలు, భోజనం నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు.

మంత్రిని విద్యార్థినులు హర్షాతిరేకంగా స్వాగతించారు. “మీకు మంచి విద్య, మంచి భోజనం అందుతున్నాయా?” అని మంత్రి సవిత విద్యార్థినులను ప్రశ్నించగా, వారు తమ అనుభవాలను పంచుకున్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలని, విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భోజన వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు.

మొంథా తుఫాన్‌కు పాఠశాల సిబ్బంది, నిర్వాహకులు అప్రమత్తం

అదేవిధంగా, మొంథా తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా పాఠశాల సిబ్బంది, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు. విద్యార్థులకు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని, అలాగే తాజా మరియు పోషకాహారంతో కూడిన భోజనాన్ని మాత్రమే అందించాలని మంత్రి సవిత ఆదేశించారు.

విద్యార్థినులతో కలిసి భోజనం

తరువాత మంత్రి సవిత విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. వారితో సరదాగా మాట్లాడి వారి అభిరుచులు, చదువుపై ఆసక్తి గురించి తెలుసుకున్నారు. విద్యార్థినులు తమ గురుకుల పాఠశాలలో చదువుకునే అవకాశాన్ని అందించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవీలత, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రి సవిత మాట్లాడుతూ, “ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది. ప్రతి బాలిక విద్యతో పాటు ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తాం” అని తెలిపారు.

మాదల గురుకుల పాఠశాలలో జరిగిన ఈ సందర్శన సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *