Navataram

Real news Real time

ఆర్యవైశ్యుల అభివృద్ధే లక్ష్యం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అన్ని రంగాల్లో ఆర్యవైశ్యుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ సంఘం, ఏపీ ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, వాసవీ ఫౌండేషన్, ఐవీఎఫ్ ప్రతినిధులు ప్రతినిధులు గురువారం కలిశారు.

రాష్ట్రంలోని వైశ్యులను ఆర్య, శెట్టి, గుప్త, కోమటి, వేగిన, బుక్క, జనపశెట్టి అనే పేర్లతో సంభోదిస్తున్నారని, వారందరినీ ఆర్యవైశ్యులుగా ప్రభుత్వం గుర్తిస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఆది నుంచి సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఆర్థికంగానూ, రాజకీయంగానూ అభివృద్ధి చెందేలా ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. 2018-19లో ఆర్యవైశ్యుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు రూ.30 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. అన్ని కులాల మాదిరిగానే ఆర్యవైశ్యుల్లోనూ పేదలున్నారని, అటువంటి వారిని గుర్తించి ఆర్థికంగా అభివృద్ధే చెందేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇందులో భాగంగానే ఏపీ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మాదిరిగా ఆర్యవైశ్యులకు ఆర్థిక భరోసా కల్పించడానికి సహకార క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. త్వరలోనే ఏపీ ఆర్యవైశ్య కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నామన్నారు. ఏపీ ఆర్యవైశ్య కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఆర్యవైశ్యులకు రుణ సదుపాయం కల్పించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అయిదేళ్ల జగన్ పాలనలో ఆర్యవైశ్యులకు ఎటువంటి మేలు చేయలేదన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కొనియాడారు. ఆర్థిక రంగంలో, వ్యాపారాల నిర్వహణలో ఆర్యవైశ్యులు కీలకమని, తమ వ్యాపారాల నిర్వహణతో ఎందరికో ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా ఇంటికో వ్యాపార వేత్తను తయారు చేసేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధంచేశారన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేయబోతున్నామన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *