ఇటీవల నిర్వహించనున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను పూర్తి స్థాయిలో, స్పష్టంగా నమోదు చేయాలని మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు దేవేందర్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ఎన్నికల వ్యయ నిర్వహణపై అభ్యర్థులతో అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ఖర్చుల నిర్వహణ అత్యంత కీలకమని తెలిపారు. అభ్యర్థులు చేపట్టే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ముందస్తుగా సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చేసిన ప్రతి ఖర్చును ప్రత్యేకంగా నమోదు చేసి, నిర్దిష్ట కాలపరిమితిలో వ్యయ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అభ్యర్థులు తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహించాలని, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన బిల్లులు, రశీదులు, వౌచర్లు తదితర రికార్డులను సక్రమంగా భద్రపరచుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల వ్యయ పరిమితులు, వాటి అమలు విధానం, ఖర్చుల పర్యవేక్షణ వ్యవస్థపై అభ్యర్థులకు సమగ్ర అవగాహన కల్పించామని తెలిపారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఖర్చుల పరిమితిని అధిగమించినట్లయితే, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. న్యాయమైన, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించడమే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని, అందుకు అభ్యర్థుల సహకారం అవసరమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల వ్యయ నోడల్ అధికారి నదీమ్ ఖుద్దుసి, ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గజానన్, మాస్టర్ ట్రైనర్ ఊసన్న, ఎన్నికల విభాగం అధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థులు తదితరులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.











Leave a Reply